నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా.. తెల్లారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీలో ఉన్న శ్వేత ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి.. మరణించి ఉండటంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో కలకలం రేగింది.
ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పని ఒత్తిడా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆస్పత్రిలోకి మీడియాను అనుమతించకపోవటంతో డాక్టర్ శ్వేత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. అలాగే, మరో నెల రోజుల్లో శ్వేత పెళ్లి నిశ్చయమైంది. ఈ సమయంలో మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ శ్వేత కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి నిజామాబాద్‌కు చేరుకున్నారు.
ఈ ఘటనపై సూపరిండెంట్ డా. ప్రతిమ రాజ్ మీడియాతో మాట్లాడారు. డా. శ్వేతా చాలా యాక్టివ్ స్టూడెంట్ అని, ఆమె మృతి తమను షాక్‌కి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీ అనంతరం రెస్ట్ తీసుకోవడానికి వెళ్లి అక్కడ కుప్ప కూలి పోయిందని పేర్కొన్నారు. అయితే, డా శ్వేతాకు 2 సార్లు కోవిడ్ వచ్చిందని, కోవిడ్ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్‌తో మృతిచెంది ఉండవచ్చని అనుమానిస్తున్నామని అన్నారు. కోవిడ్‌తో సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు.