తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 16 అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా అవార్డులు ఇచ్చిన కేంద్రానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు గెలిచిన 19 పట్టణాలకు రూ.2 కోట్ల నిధులిస్తామని మంత్రి తెలిపారు.
స్వచ్ఛ కార్యక్రమాలపై అధ్యయనం కోసం 10 మంది బృందాన్ని జపాన్, సింగపూర్‌కు పంపుతామని వెల్లడించారు. స్వచ్ఛతపై బాగా పనిచేస్తున్నవారిని ప్రోత్సహించేందుకు అదనపు నిధులు కూడా ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. కాగా పరిశుభ్రతపై ప్రజల్లోనూ స్వతహాగా చైతన్యం రావాలన్నారు. స్వచ్ఛత విభాగంలో ఇండోర్‌కు వరసగా ఆరోసారి అవార్డు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు
ప్రజలు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు.
అలాగే కేంద్రం అవార్డులు ఇవ్వడంపై బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒకవైపు కేంద్రం అవార్డులు ఇస్తుంటే.. మరోవైపు బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కొందరు ఆరోపణలు చేస్తూంటారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్‌గా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు కేటీఆర్. బాగా పని చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 50 శాతం రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.