ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతితో ఆయన కుటుంబానికి మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు స్వామి అని.. ఆయన ఎంతో మందికి ప్రేరణ అని కేటీఆర్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో 32 ఏళ్ళ ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం ఉదయం మృతిచెందాడు. ట్రై సైకిల్ పైనుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ”స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ఆయన. ఎంతో మందికి ఆయన ప్రేరణ. స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి” అని సంతాపం ప్రకటించారు.
అయితే ఫ్లోరోసిస్ బాధితుడు స్వామికి మంత్రి కేటీఆర్ కు మధ్య మంచి అనుబంధముంది. స్వామికి కేటీఆర్ ఇల్లు కూడా కట్టించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్ ఏర్పాటు చేయించారు. మూడు నెలల క్రితం ఆయన ఇంటి గృహ ప్రవేశానికి కూడా కేటీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేస్తూ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఎంతో పోరాటం చేసిన అంశాల స్వామి మృతితో నల్గొండలో విషాదం నెలకొంది.