సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్ లోని సిబ్బంది,స్థానికులు పరుగులు తీశారు.
సెల్లార్ లో వైర్లు కాలి 4,5,6,7 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని 12 మందిని కాపాడారు. అందులో ఆరుగురు మరణించారు. అయితే ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి స్పందించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనే భావిస్తున్నారు. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పెట్టినా అవి ఏమాత్రం పనిచేయలేదు. బిల్డింగ్ లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగారు. అయితే ప్రస్తుతానికి బిల్డింగ్ పరిస్థితి బాగా ఉందని నిర్ధారించారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ లో తప్పనిసరిగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ మెయింటెనెన్స్ సరిగ్గా ఉంచుకోవాలని నాగిరెడ్డి సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు లాక్ చేయకూడదన్నారు.
అయితే చనిపోయిన వాళ్ల ప్రాంతంలో తాళాలు వేసి ఉండడంతో వాళ్లు బయటపడలేక పోయారన్నారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వాళ్లు మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ వారికి నోటీసులు ఇచ్చినా వాటిని పాటించలేదని నాగిరెడ్డి అన్నారు.కాంప్లెక్సులు ఉన్న వాళ్లు లిఫ్ట్ తో పాటు మెట్ల దారిని కూడా తెరచి ఉంచాలని చెప్పారు. ఏ కాంప్లెక్స్ లో అయినా మెట్ల దారిని లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.