కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఉజ్జయినిలో సాగుతోంది. గురువారం ఈ యాత్రలో ఆయనతో కలిసి బాలీవుడ్ నటి స్వరభాస్కర్ కూడా పదం పదం కలిపి నడిచింది. ఇప్పటికే రాహుల్ యాత్రలో పూజా భట్, సుశాంత్ సింగ్, రియా సేన్, రష్మీ దేశాయ్, అమోల్ పాలేకర్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు ఈ నటి కూడా చేరింది.
రాహుల్ యాత్రలో పాల్గొనేలా సినీ స్టార్స్ కి కాంగ్రెస్ పార్టీ డబ్బులు చెల్లించి, వారికో టైమ్ స్లాట్ కేటాయించి పబ్బం గడుపుకుంటోందని బీజేపీ ఇటీవల ఆరోపించింది. వారిని గెస్టులుగా వాడుకుంటోందని విమర్శించింది. అయితే ఈ ఆరోపణపై రాహుల్ స్పందించలేదు.
పార్టీ మాత్రం దీన్ని ఖండిస్తూ.. యాత్రకు వస్తున్న సినీ నటీనటులు దేశ ప్రయోజనాలనాశించి వస్తున్నారని, వారికి తాము డబ్బులు చెల్లిస్తున్నామనడం సరికాదని పేర్కొంది.
రాహుల్ యాత్ర ప్రారంభించగానే స్వరభాస్కర్ దీనికి తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందుతున్నప్పటికీ.. రాహుల్ పై వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన దేనికీ లొంగకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని, మతతత్వ పార్టీల వైఖరిని ఎండగడుతూనే ఉన్నారని ఆమె లోగడ ట్వీట్ చేసింది. ఈ యాత్ర పట్ల ఆమె హర్షం ప్రకటించింది.