– బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనే లక్ష్యం
– 10వేల కిలోమీటర్ల ప్రయాణం
– వంద రోజులకు చేరుకున్న పాదయాత్ర
– ఓటు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ముందుకెళ్తున్న విశారధన్
తెలంగాణ గడ్డపై బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనకై దళిత శక్తి ప్రోగ్రాం ప్రెసిడెంట్ డాక్టర్ విశారధన్ మహారాజ్ చేపట్టిన స్వరాజ్య పాదయాత్ర వంద రోజులకు చేరుకుంది. 10వేల కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్రను మార్చి 15న కల్వకుర్తిలో ప్రారంభించారు. విశారధన్ గ్రామగ్రామానికి వెళ్తూ.. రాజ్యాంగ విలువలు, రాజకీయ విద్యను వివరిస్తూ ఓటుహక్కుపై అవగాహనను కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ఈ వంద రోజుల్లో విశారధన్ ఎక్కడకు వెళ్లినా ఆయా గ్రామాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వచ్ఛందంగా భోజనాలు, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్రకు మద్దతుగా నిలిచి విశారధన్ తో అడుగులో అడుగేస్తున్నారు. స్వరాజ్య పాదయాత్రకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా కోటి సంఘీభావ సంతకాల సేకరణ కార్యక్రమం సైతం కొనసాగుతోంది. మేధావులు, విద్యావంతులు ఉద్యోగులు, పలు సామాజిక సంఘాల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ సంతకాలు చేస్తున్నారు.
పాదయాత్ర కొనసాగుతున్న ప్రాంతాల్లో దళిత శక్తి ప్రోగ్రాం జెండా దిమ్మెలను ఆవిష్కరిస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. డప్పులు, మహిళల మంగళహారతులతో పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ సామాజిక సంఘం దిమ్మెలపై భారత రాజ్యాంగం వర్ధిల్లాలని రాయలేదు. కానీ.. డీఎస్పీ జెండా దిమ్మెలపై జై భీమ్.. జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలని రాస్తున్నారు.
10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర గుర్తుగా స్వచ్ఛందంగా జనం శిలాఫలకాలు వేస్తున్నారు. రాజ్యాంగం చేతబట్టి విశారధన్ మహారాజ్ సారథ్యంలో పాదయాత్ర బృందం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. యాత్ర ఎండనక వాననక చలి అనక రేయనక పగలనక కొనసాగుతోంది. ఇప్పటివరకు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగింది. 9 జిల్లాలు దాటుకొని 10వ జిల్లా నిజామాబాద్ లోకి ఎంటర్ అయింది.
వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర.. మరో 400 రోజులు 23 జిల్లాల్లో కొనసాగనుంది. వచ్చే ఏడాది మార్చి 15కు హైదరాబాద్ కు చేరుకోనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనే లక్ష్యంగా మహోన్నత ఆశయం కోసం.. మహనీయులు కన్న కలలను నిజం చేసేందుకు ఫూలే, అంబేద్కర్, కాన్షిరాంల ఉద్యమంగా దళిత శక్తి ప్రోగ్రాం తెలంగాణలో విస్తృతంగా పని చేస్తూ స్వరాజ్య భావజాల వ్యాప్తిని కల్పిస్తోందని చెబుతున్నారు విశారధన్.