విజయవాడలో అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ హోటల్‌లో కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ అంతా బోగస్ అని తేలింది. చనిపోయిన 10 మంది మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అనుమానంతో హోటల్లో చికిత్స పొందిన మిగిలిన బాధితులకు కూడా టెస్టులు చేయగా..అధికారులకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. మొత్తం 31 మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే పాజిటివ్ అని గుర్తించారు. దీంతో కరోనా పేరుతో రమేష్ ఆస్పత్రి ఆడుతున్న నాటకం బయటపడింది.
కరోనా లేకపోయినా ట్రీట్‌మెంట్ పేరుతో రమేష్ ఆస్పత్రి యజమాన్యం వారి నుంచి లక్షల రూపాయలు దండుకునేందుకు స్కెచ్ వేసినట్టుగా అధికారులు గుర్తించారు.ప్రాథమిక సమాచారం మేరకు ఒక్కొక్క బాధితుడి నుంచి రోజుకు 25 వేల నుంచి 30 వేల రూపాయలు చెల్లించేందుకు ఆస్పత్రి ఒప్పందం కుదర్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు 3800తో పాటు మందులకు అయ్యే ఖర్చును మాత్రమే రోగి నుంచి వసూలు చేయాలి. కానీ రూల్స్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది.
ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తికి గతంలోనే కరోనా నయమైంది. కానీ వైరస్ లంగ్స్‌లోఅలాగే ఉండిపోయిందని భయపెట్టి.. చికిత్స తీసుకునేలా చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆస్పత్రి కరోనా దందాపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు