అయ్యప్ప స్వామిని దూషించిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నాస్తిక సంఘం నేత బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలకు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అరెస్ట్ చేసే దాకా వదలలేదు. చివరకు నరేష్ కటకటాల పాలయ్యాడు. తాజాగా అతని వ్యాఖ్యలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్పందించారు.
అయ్యప్ప స్వామిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు తగదన్నారు స్వరూపానందేంద్ర. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సూచించారు. మైనారిటీలతో పాటు హిందువులు కూడా ఓటర్లే అని గుర్తించాలన్నారు.
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై సరైన సెక్షన్లు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పారు స్వరూపానందేంద్ర. తెలంగాణ, ఆంధ్రాలో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తగిన శాస్తి జరగాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో హిందూ జాతిని మేల్కొలిపే గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ప్రముఖమైనదని తెలిపారు. అలాంటిది అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడుపోయేవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు స్వరూపానందేంద్ర.