ప్రస్తుత తరుణంలో మనకు మార్కెట్‌లో అనేక రకాల స్మార్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్ లు లభిస్తున్నాయి. వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా తమకు కావల్సిన స్మార్ట్ బ్యాండ్ లేదా వాచ్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంతకీ అసలు ఈ రెండింటికీ ఉండే తేడాలేమిటి ? వీటిని కొనదలిస్తే రెండింటిలో దేన్ని కొనాలి ? దేని వల్ల ఏ ఉపయోగం ఉంటుంది ? అంటే…
స్మార్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లకు మధ్య ఉండే పలు తేడాలను ఇప్పుడు చూద్దాం.
1. స్క్రీన్ సైజ్:
స్మార్ట్ బ్యాండ్‌ల స్క్రీన్ సైజ్ కన్నా స్మార్ట్ వాచ్‌ల స్క్రీన్ సైజ్ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. బ్యాండ్ల స్క్రీన్ సైజ్ 0 నుంచి 1 ఇంచ్ వరకు ఉంటుంది. అదే స్మార్ట్ వాచ్ స్క్రీన్ సైజ్ అయితే కొంచెం పెద్దగా 1 నుంచి 3 ఇంచుల వరకు ఉంటుంది. ఈ విషయంలో స్మార్ట్ వాచ్‌దే పై చేయి అని చెప్పవచ్చు. అలాగే స్మార్ట్ వాచ్‌లు టచ్ స్క్రీన్ టైప్‌లో ఉంటాయి. కానీ కొన్ని ఫిట్ నెట్ బ్యాండ్లలో ఫిజికల్ బటన్లను ఇస్తారు. అందువల్ల నావిగేషన్ పరంగా కూడా స్మార్ట్ వాచే బెటర్ అని చెప్పవచ్చు.
2. ఫీచర్లు:
స్మార్ట్ బ్యాండ్లలో పెడోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీవో2 సెన్సార్, స్లీప్ మానిటర్ వంటి హెల్త్ రిలేటెడ్ ఫీచర్లు ఉంటాయి. అదే స్మార్ట్ వాచ్‌లో అయితే వీటితోపాటు సిమ్ కార్డ్ స్లాట్‌లు, వైఫై కనెక్టివిటీ, కెమెరా, 4జీ ఎల్‌టీఈ, యాప్స్, యాప్ స్టోర్ వంటి ఫీచర్లు ఉంటాయి. అందువల్ల ఈ విషయంలోనూ స్మార్ట్ వాచ్ ఉత్తమం అని చెప్పవచ్చు.
3. ఇంటరాక్టివిటీ:
స్మార్ట్ వాచ్‌లు పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అలాగే టచ్ సౌకర్యం కలిగి ఉంటుంది. అందువల్ల స్మార్ట్ వాచ్ లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అలాగే దాంతో సిమ్ సౌకర్యం పొందవచ్చు. ఇంటర్నెట్ ద్వారా టెక్ట్స్ సందేశాలు, ఈ-మెయిల్స్ పంపించుకోవచ్చు. కొన్ని వాచ్‌లలో ఎస్‌డీ కార్డులను కూడా వేసుకోవచ్చు. దాంతో మ్యూజిక్, పిక్చర్లు, ఇతర ఫైల్స్‌ను స్టోర్ చేసుకుని వాటిని వాచ్‌లో చూడవచ్చు. అలాగే ఫోన్లలో వచ్చే నోటిఫికేషన్లను వాచ్‌లో సులభంగా చూసుకోవచ్చు. కానీ స్మార్ట్ బ్యాండ్ ద్వారా ఈ పనులేవీ సాధ్యపడవు. అందువల్ల ఈ విషయంలోనూ స్మార్ట్ బ్యాండ్ మైనస్ అని చెప్పవచ్చు.
4. బ్యాటరీ బ్యాకప్:
స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే స్మార్ట్ బ్యాండ్స్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అందువల్ల ఈ ఒక్క విషయంలో స్మార్ట్ బ్యాండ్స్‌దే పై చేయిగా ఉంది.
5. ధర:
స్మార్ట్ బ్యాండ్ల కన్నా స్మార్ట్ వాచ్‌ల ధరలే ఎక్కువగా ఉంటాయి.
స్మార్ట్ బ్యాండ్ లేదా వాచ్ దేన్ని కొనాలి ?
స్మార్ట్ బ్యాండ్‌లలో ఉండే ఫీచర్లన్నీ స్మార్ట్‌వాచ్‌లలోనూ ఉంటాయి. కాకపోతే వాచ్‌లలో కొన్ని ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. అయితే కేవలం ఫిట్‌నెస్ కోసమే అనుకుంటే స్మార్ట్ బ్యాండ్‌ను కొనవచ్చు. అలా కాకుండా వాచ్‌ను కొంటే ఫిట్‌నెస్‌తోపాటు రోజువారీ అవసరాలకు కూడా వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు. అందువల్ల రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో ఇక మీ ఇష్టం. కానీ కేవలం ఫిట్‌నెస్ కోసమే అయితే స్మార్ట్ వాచ్‌ను కొనడం వృథా. అలాగే నిత్యం ఉపయోగిస్తామనుకుంటే బ్యాండ్‌ను కాకుండా వాచ్‌ను కొనాలి.