టైటిల్ చూసి కన్ప్యూజ్ అవ్వొద్దు. అశోకవనంలో అర్జునకల్యాణం, స్వాతిముత్యం సినిమాలకు సంబంధించిన మేటర్ ఇది. తాజాగా థియేటర్లలోకి వచ్చింది స్వాతిముత్యం సినిమా. బెల్లంకొండ గణేశ్ ఈ సినిమాతో హీరోగా మారాడు. సినిమా కూడా బాగుంది. అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. కానీ ఫలితం మాత్రం శూన్యం.
ఓవైపు గాడ్ ఫాదర్, మరోవైపు ఘోస్.. ఇలా 2 పెద్ద సినిమాల మధ్య వచ్చిన ఈ సినిమా చికితిపోయింది. టాక్ బాగున్నప్పటికీ ఆడియన్స్ ఈ సినిమాకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. అదే కాంపిటిషన్ లేని టైమ్ లో వచ్చి ఉంటే, డీజే టిల్లూ తరహాలో బ్లాక్ బస్టర్ అయ్యేంత సరుకు ఈ సినిమాలో ఉంది.
సరిగ్గా ఇక్కడే స్వాతిముత్యం సినిమాను అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాతో పోలుస్తున్నారు జనాలు. ఆ సినిమాకు కూడా ఇలానే జరిగింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా రాంగ్ టైమ్ లో రిలీజ్ అయింది. మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా, అశోకవనంలో అర్జునకల్యాణంను పూర్తిగా తొక్కేసింది. దీంతో హిట్ టాక్ వచ్చినప్పటికీ విశ్వక్ సేన్ మూవీ కోలుకోలేకపోయింది. బాగుందంట, చూద్దాం అని జనాలు అనుకునేలోపే థియేటర్ల నుంచి లేచిపోయింది.
ఇలా అశోకవనంలో అర్జునకల్యాణం, స్వాతిముత్యం సినిమాలది తెరపై కథలు వేరైనా, బిజినెస్ పరంగా రెండింటిదీ ఒకటే కథ. ఓ సినిమాకు రిలీజ్ డేట్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ రెండు మూవీస్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ గా నిలుస్తున్నాయి.