మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కు సైతం అత్యాచార బెదిరింపులు తప్పడం లేదు. ఇన్ స్టాలో తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతీ మాలీవాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.
గతంలో మీటూ ఉద్యమం సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ షో నుంచి తొలగించాలని కోరుతూ నిన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ కు స్వాతీ మాలీవాల్ లేఖ రాశారు.
లేఖ రాసినప్పటి నుంచి తనకు ఇన్ స్టా గ్రామ్ లో అత్యాచార బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. వారు తమ పనిని అడ్డుకోవాలని చూస్తున్నట్టు ఆమె తెలిపారు. అందుకే వారిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.
ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారనే విషయాన్ని దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరినట్టు ఆమె ట్వీట్ లో తెలిపారు. దీంతో పాటు తనకు ఇన్ స్టాలో వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఆమె అటాచ్ చేశారు.