ఢిల్లీ జాతీయ మహిళా కమిషన్ చీఫ్ .స్వాతి మలివాల్ .తన చిన్నతనంలో తన తండ్రి నుంచి లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఇదే.. సమాజంలో ఇలా చిన్నతనంలోనే తండ్రుల నుంచి వేధింపులు ఎదుర్కొన్న మహిళల్లో చైతన్యం రగిలించడానికి, సమాజ సేవ చేసేందుకు తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇంత ధైర్యంగా మాట్లాడినందుకు చాలామంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదే సమయంలో ఆమె వ్యాఖ్యలకు నెటిజనులు షాక్ తింటూనే తాజాగా ఆమెను ట్రోల్ చేస్తూ ట్వీట్లను వెల్లువెత్తిస్తున్నారు. 2019 లో మీరు చేసిన వ్యాఖ్యల తాలూకు ట్వీట్లను గుర్తు చేస్తున్నామంటూ వాటి స్క్రీన్ షాట్లను వారు షేర్ చేశారు. అది 2019 ఫిబ్రవరి 26 నాటి స్వాతి మలివాల్ ట్వీట్.. తన తండ్రి పట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నానని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తాకు తన సెల్యూట్ అని, ఎయిర్ ఫోర్స్ ఆఫీసరైన తన తండ్రికి కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నానని ఆమె నాడు పేర్కొన్నారు
. దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్ స్పందిస్తూ.. నిజం ఏమిటని ప్రశ్నించారు. ఆమె చేసిన మూడు ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఆయన కూడా షేర్ చేశారు. అప్పుడలా అన్నారని, మరి ఇప్పుడు .. మీ తండ్రి నుంచి మీ చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని అంటున్నారని ఆయన అన్నారు.
2016 లో కూడా స్వాతి మలివాల్.. తన తండ్రిని పొగుడుతూ ట్వీట్ చేశారని కాంగ్రెస్ నేత రాధికా ఖేరా గుర్తు చేశారు. వాటిని ఆమె కూడా స్క్రీన్ షాట్లు తీసి… ఈ ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ‘లైంగిక వేధింపుల’ అంశాన్ని మీరు తెరపైకి తెచ్చినట్టు కనబడుతోందని ఆరోపించారు. ఇక ఢిల్లీ జాతీయ మహిళా కమిషన్ మాజీ చీఫ్ బర్ఖా శుక్లా … బహుశా మలివాల్ తన మానసిక స్థితిని కోల్పోయినట్టు భావిస్తున్నానన్నారు. ఇలాగే బీజేపీకి చెందిన ప్రీతీ గాంధీ కూడా స్పందిస్తూ.. ఏది నిజమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ అంశం దుమారం రేపగా.. కొందరు స్వాతి మలివాల్ ను సమర్థిస్తూ ట్వీట్ చేశారు.