నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్, ఫిన్లాండ్ లు సన్నాహకాలను పూర్తిచేసుకున్నాయి. ఇరు దేశాలు ఈ ఏడాది మే మధ్య నాటికి దరఖాస్తులను చేసుకుంటాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ దరఖాస్తులకు ఆమోదం లభిస్తే ఈ రెండు దేశాలకు నాటోలో సభ్యత్వం లభించనుంది.
ఈ రెండు దేశాలు ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రెండు దేశాలకు నాటోలో సభ్యత్వం లభిస్తే అవి రష్యాకు సవాళుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలను భయపెట్టేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే స్వీడన్, ఫిన్లాండ్ లను ద్వైపాక్షిక దౌత్య మార్గాల్లో రష్యా పలు మార్లు హెచ్చరించింది. నాటోలో చేరితో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ రెండు దేశాలకు రష్యా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
రష్యాతో ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. రష్యా ఇస్తున్న హెచ్చరికలకు ఫిన్లాండ్ కూడా ఘాటుగానే సమాధానం ఇస్తోంది. నాటోలో చేరే విషయంపై రాబోయే కొన్ని వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ అన్నారు.