రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అందుకు అనుగుణంగా నూతన మార్గాన్ని ఎంచుకుంది. మే నుండి ఆకాశ మార్గాన ఫుడ్ డెలివరీ చేయనున్నట్టు వెల్లడించింది. తన ఇన్‌స్టాంట్ గ్రోసరీ డెలివరీ సర్వీసు ‘ఇన్‌స్టామార్ట్’ కోసం డ్రోన్లను వాడేందుకు పైలట్ సేవలను ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో తన ప్రాజెక్టు పైలట్ సేవల కోసం నాలుగు డ్రోన్ స్టార్టప్‌లను కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసినట్టు తెలిపింది. షార్ట్ లిస్టు అయిన కంపెనీలు గరుడ ఏరోస్పేస్, స్కైఎయిర్ మొబిలిటీ, ఏఎన్‌ఆర్ఏ ప్లస్ టెక్ఈగల్ కన్సార్టియా, మారుత్ డ్రోన్‌టెక్ లు ఉన్నాయని స్పష్టం చేసింది. డార్క్ స్టోర్లు అంటే సెల్లర్ల లొకేషన్ నుంచి కస్టమర్ల అడ్రస్‌కు దగ్గర్లో ఒక కామన్ పాయింట్ వద్దకు గ్రోసరీలను స్విగ్గీ డెలివరీ చేయనున్నట్టు వెల్లడించింది సంస్థ.
డ్రోన్ కామన్ పాయింట్ వద్దకు స్టాక్‌ను డెలివరీ చేస్తే.. వాటిని కామన్ పాయింట్ నుంచి డెలివరీ పార్ట్నర్లు పికప్ చేసుకుని కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తారని స్విగ్గీ తన బ్లాక్ పోస్టులో పేర్కొంది. అయితే.. ఈ పైలట్ ప్రాజెక్టును రెండు దశలలో స్విగ్గీ నడపనుంది. మొదటిది బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ లలో గరుడ, స్కైఎయిర్‌లు పైలట్ ప్రాజెక్టును నిర్వహించి అందుకు కావలసిన పైలట్ ను వచ్చే వారం ప్రారంభంలోనే కంపెనీ ప్రారంభించనుంది.
రెండో ప్రాజెక్టును ఏఎన్‌ఆర్ఏ ప్లస్ టెక్ ఈగల్, మారుత్ డ్రోన్‌టెక్ లు నిర్వహిస్తాయి. తొలి దశలో నేర్చుకున్న అంశాల నుంచి రెండో దశ ప్రాజెక్టు ఉంటుంది. తాము డ్రోన్ డెలివరీ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు చెప్పగానే.. పలు కంపెనీలు తమతో జతకట్టేందుకు పోటీ పడ్డాయని స్విగ్గీ తెలిపింది. 345 అప్లికేషన్లు వస్తే.. నాలుగు స్టార్టప్‌లు ఈ సేవలకు ఎంపికైనట్టు స్విగ్గీ తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి చాలా ఈకామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీలు డ్రోన్ ఆధారిత సేవలను లాంచ్ చేసేందుకు అనుమతులు కోరుతున్నాయి.