స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న నొప్పి కూడా లేకుండా కేవలం నిమిషం వ్యవధిలోనే చనిపోయే యంత్రం వాడకానికి అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. సార్కో క్యాప్సూల్ అని పిలిచే ఈ యంత్రం ద్వారా అనుమతితో మనిషి తనంతట తాను చనిపోవడానికి వీలు ఉంటుంది. శవ పేటికలా ఉండే దీన్ని.. లోపల ఉండే వ్యక్తి కూడా ఆపరేట్ చేసేలా డిజైన్ చేశారు. అలాగే ఎక్కడికి కావాలంటే అక్కడకు మోసుకెళ్లొచ్చు.
అసిస్టెడ్ సూసైడ్ కు స్విట్జర్లాండ్ లో చట్టబద్దత ఉంది. గతేడాది 13వందల మంది చనిపోయారు. అయితే వాళ్లంతా ఓ ఇంజెక్షన్ ద్వారా అధికారికంగా మరణించినవాళ్లు. కానీ.. ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా మృతి చెందేందుకు అనుమతిని ఇచ్చారు.
ఈ యంత్రం లోపల ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దాని కారణంగా వ్యక్తి హైపోక్సియా, హైపోక్యాప్నియా కారణంగా చనిపోతాడు. అనారోగ్యంతో ఎక్కువకాలం మాట్లాడలేని, కదలలేని రోగులకు ఈ యంత్రం చనిపోయేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు.
ప్రస్తుతం రెండింటిని రెడీ చేశారు. వచ్చే ఏడాదికి మరొకటి సిద్ధం చేస్తామని చెబుతున్నారు తయారీదారులు. మరోవైపు ఈ యంత్రం అనుమతిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది గ్యాస్ చాంబర్ లాంటిదని కొందరు అంటుంటే.. ఆత్మహత్యను ప్రోత్సహిస్తోందని మరికొందరు చెబుతున్నారు. హిట్లర్ కాలంలో శత్రువులను చంపేందుకు గ్యాస్ చాంబర్లు వాడేవారని చెబుతుంటారు.