బొబ్బిలి పులి సినిమాలో ఓ డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. కోర్టు కోర్టుకు, తీర్పు తీర్పునకు మార్పు ఉంటే న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నిస్తాడు ఓ చోట కథానాయకుడు. నిజంగానే కొన్ని నేరాల్లో కోర్టులు మారేకొద్ది.. ఇప్పటికీ తీర్పులు మారుతూనే ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి స్విట్జర్లాండ్ లో దుమారం రేపింది.
అత్యాచారం కేసులో శిక్షపడిన ఓ నిందితునికి స్విస్ అప్పీల్ కోర్టు ఆశిక్షను తగ్గించింది. అత్యాచారం కేవలం 11 నిమిషాలు మాత్రమే జరిగిందని, బాధితురాలికి తీవ్రగాయాలు కాలేదని భావించిన కోర్టు ఆ శిక్షను తగ్గించినట్టుగా అక్కడి స్థానిక మీడియా తెలిపింది. అయితే అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి మహిళలు భగ్గుమన్నారు. 11 నిమిషాలు మాత్రమే చేస్తే మాత్రం అది అత్యాచారం కాదా అని మండిపడ్డారు. వందలాదిగా తరలి వచ్చి కోర్టును చుట్టుముట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. “11 నిమిషాలు తక్కువ కాదు.. చాలా ఎక్కువ అంటూ ఆందోళన నిర్వహించారు. ఈ తీర్పు వ్యవహారం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది.
గత ఏడాది ఫిబ్రవరిలో క్లబ్ నుంచి బయటకు వచ్చిన మహిళపై 33 ఏళ్ల యువకుడు, అతని వెంటే ఉన్న 17 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశారు. ఈ కేసులో యువకుడిని నాలుగు సంవత్సరాల మూడు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. బాలుడికి సంబంధించి స్విస్ జువైనల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు అప్పీల్ కోర్టును ఆశ్రయించగా.. అతనిపై శిక్షను మూడేళ్లకు తగ్గించడం దుమారం రేపుతోంది. కోర్టు తీర్పు అత్యాచారానికి బాధితురాలిదే తప్పు అన్నట్టుగా ఉందని ఆమె తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.