
మెగాస్టార్ చిరంజీవి వరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సూపర్ సక్సెస్.. సమరయోధుడి పాత్ర చేయాలంటే దానికో రేంజ్ వుంటుంది. చిరంజీవి దానికి సరిగ్గా తులతూగాడు. అరవై ఏళ్ల వయసులో కూడా హైలెవల్ పవర్ పెర్ఫామెన్స్ చూపించాడు. ఆ పాత్రకు చిరు లుక్ చక్కగా సరిపోయింది.
ఇక యాక్షన్ పార్ట్‌లో చిరంజీవి పోరాటాలు అదిరిపోయేలా వున్నాయి.

ఇక ఎమోషనల్ సీన్స్‌లోనూ చాలా గొప్పగా నటించాడు. ముఖ్యంగా ముగింపు ఘట్టంలో చిరంజీవి హావభావాలు, నటన చాలా బాగున్నాయి. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్న కాసేపు బాగా చేశారు. అవుకురాజు పాత్రలో కిచ్చాసుదీప్, రాజా పాండి పాత్రలో విజయ్ సేతుపతి, సిద్ధమ్మ పాత్రలో నయనతార, లక్ష్మీ పాత్రలో తమన్నా, వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు ఇలా అందరూ వారి వారి పాత్రలకు జీవం పోశారు.
నిజానికి ఓ సమర యోధుడి చిత్రాన్ని అప్పటి కాలానికి తగినట్లు తెరకెక్కించడం అంటే అంత వీజీ కాదు. అది కూడా చరిత్రలో కనుమరుగైన ఓ యోధుడి కథను తీసుకుని ఈ చిత్ర నిర్మాత దాన్ని చరితార్ధం చేయడంలో విజయవంతం అయ్యాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది. సురేందర్ రెడ్డి సినిమాను విజువల్ వండర్‌లా తెరకెక్కించాడు. అమిత్ త్రివేది సంగీతం, జూలియస్ పేకియం బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ అదుర్స్. గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్, రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను చాలా రిచ్‌గా కంపోజ్ చేశారు.
కాకపోతే, సినిమాలో ఏదైనా ఎత్తి చూపాలంటే అది రచయితల పార్టే. సమరయోధుడి కథను రాయడం, తీయడం కత్తి మీద సాము అని తెలిసినా.. మోతాదుకు మించిన స్వేచ్ఛను తీసుకుని కథను కెలికేశారు. మూడు నాలుగు తాలూకాలను పాలించే పాలెగాడు నరసింహారెడ్డి వేలాది మంది బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోయడమే ఎబ్బెట్టుగా వుంది. ఇక్కడ హీరో చిరంజీవి కాబట్టి.. జనం యాక్సెప్ట్ చేస్తారని ఊహించి వుండవచ్చు. నరసింహారెడ్డి గొరిల్లా యుధ్ధాలు చేసేవాడని చరిత్ర చెబుతోంది. సినిమాలో దానికి భిన్నంగా చూపించారు. చరిత్ర ప్రకారం నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ తన భర్త బ్రిటీష్ వారికి లొంగక ముందే చనిపోతుంది. కానీ సినిమాటిక్‌గా కథ మార్చిపడేశారు. నిజం చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ మూవీ అంతా లాక్కొచ్చినట్టు మహా బోరింగ్‌గానే వుంటుంది. పవర్‌ఫుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లాక్కొచ్చి బయట పడేస్తుంది.

తొలి స్వాతంత్ర్య సమర సమయంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయ్ (అనుష్క) తన సైనికుల్లో స్ఫూర్తి నింపడానికి రేనాడు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చెప్పడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రథమ స్వాతంత్య్ర సమరం కంటే ముందు.. అంటే 1847లో రాయలసీమలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు నరసింహారెడ్డి (చిరంజీవి). బ్రిటీష్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ఉండేవారు. వారిలో నరసింహారెడ్డి కూడా ఓ పాలెగాడు. తీవ్రమైన కరువు వచ్చినప్పుడు బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులను పన్నులు కట్టమని వేధించడం మొదలు పెడతారు. గురువు గోసాయి ఎంకన్న(అమితాబ్ బచ్చన్) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే అకృత్యాలు చూడలేక నరసింహారెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. ఈయనకు అవుకు రాజు(కిచ్చాసుదీప్), రాజా పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతిబాబు) అండగా నిలుస్తారు. బ్రిటీష్‌వారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా ఎదిరించాడు.. వారితో నరసింహారెడ్డి ఎలాంటి పోరాటాలు చేశాడు.. చివరకు ఆయన్ని బ్రిటీష్‌వారు ఎలా బంధించి ఉరి తీశారనేదే స్టోరీ..