జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అతి విశాలమైన ‘టీ 5 టనెల్’ ని నిన్న ప్రారంభించారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 2020 ఫిబ్రవరిలోనే ఈ హైవే రీఅలైన్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాంత్యాల్ ప్రాంతంలోని ఈ టనెల్ నిర్మాణం వల్ల కశ్మీర్ కి, దేశంలోని ఇతర ప్రాంతాలకు రోడ్ లింకింగ్ సౌకర్యం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
నిజానికి 2011 లోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీని నిర్మాణం ప్రారంభించినా.. మధ్యమధ్యలో అవాంతరాయాలు ఏర్పడుతూ వచ్చాయి. గత రెండేళ్లుగా తాత్కాలికంగా ఇక్కడ ఐరన్, స్టీల్ టనెల్ ఉంటూ వచ్చిందని, కానీ దాని స్థానే ఈ అతి పెద్ద టనెల్ నిర్మాణం వల్ల ఈ మార్గంలో ప్రయాణించేవారి ఇబ్బందులు తీరనున్నాయని అధికారులు చెప్పారు.
270 కి.మీ. పొడవునా ఉన్న జాతీయ రహదారిపై ఇది నాలుగు లేన్ల ప్రాజెక్టు. గత ఏడాది ఈ టనెల్ ని నేషనల్ హైవే అథారిటీ ప్రజలకు అంకితం చేసింది.
ఇక్కడే చిన్నపాటి బ్రిడ్జీల నిర్మాణం కూడా పూర్తి కావస్తోందని, జులై నాటికి ఇదంతా ఓ బైపాస్ రోడ్డుగా మారుతుందని తెలుస్తోంది. తాజాగా దీన్ని ఓపెన్ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.లోగడ 200 మంది ఇంజనీర్లు, సూపర్ వైజర్లు, కూలీలు ఈ విశిష్టమైన టనెల్ నిర్మాణానికి కృషి చేశారని అధికారులు వెల్లడించారు.