బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట బుధవారం వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయన్ని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంపై మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుంభ కోణాలకు పాల్పడినప్పుడు అరెస్టులు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని అన్నారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు.
ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల ఆయన దిష్టి బొమ్మలు కూడా దహనం చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపింది.
మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేసి వుండాల్సింది కాదని ఎంపీ ధర్మపురి అరవింద్ సహా పలువురు అన్నారు. ఆ వ్యాఖ్యలను సంజయ్ వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు.