హైదరాబాద్: తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమాలలో అధికారులు కేవలం పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు వేరే ఉన్నారని బేజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు చేసిన ప్రకటనపై లక్ష్మణ్ స్పందించారు. విద్యుత్ సంస్థల్లో ఎలాంటి కుంభకోణాలు జరగలేదనుకుంటే విచారణ జరిపించవచ్చు కదా.. పోనీ స్వయంగా ప్రభాకరరావే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఒప్పించవచ్చు కదా అని లక్ష్మణ్ కామెంట్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో భారీ కుంభకోణాలు జరిగినట్టు తాను నిరూపిస్తానని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం చెప్పగలదా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.