ఇన్నేళ్ల టీఆర్ ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడికి అయిన భూమి పట్టా వచ్చిందా అంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటుందని ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో పోడు భూముల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోందన్నారు. లంబాడి భాష కూడా మాట్లాడుతానని, తన నియోజకవర్గంలో లంబాడి, గిరిజన సంక్షేమం కోసం పని చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతి తండా, గూడెంలలో సీసీ రోడ్ల నిర్మాణం చేశానన్నారు.
కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ పాలనలో తండాలు ఆగమయ్యాయని ఉత్తమ్ విమర్శించారు. గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్ అయినట్లు తెలిపారు. బంజారాహిల్స్ లో బంజారా భవన్ కట్టారు. మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని వెల్లడించారు.
కొత్త గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు కూడా లేకపోవడంతో చెట్ల కిందనే పాలన నడుస్తోందన్నారు. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. మునుగోడు లో కూడా ప్రజల్లో అవగాహన కోసం సదస్సు పెడితే తప్పకుండా వస్తానని తెలిపారు.