తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే జనవరి 11 న రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఆయన టూర్ కు సంబంధించి ఏఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 11 ఉదయం 7 :20 గంటలకు ఆయన ఢిల్లీ నుండి బయలుదేరి 9 :25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
తొలిరోజు ఏఐసీసీ సెక్రటరీ ఇంఛార్జ్ తో మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. ఆ తరువాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాణిక్ రావు సమావేశం అవుతారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ముందుగా డీసీసీ ప్రెసిడెంట్లతో మాణిక్ రావు ఠాక్రే సమావేశం కానున్నారు.
తరువాత ఫ్రంటల్ సంస్థ అధ్యక్షులతో సమావేశం అవుతారు. సాయంత్రం తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే మాణిక్కం ఠాగూర్ స్థానం లో మాణిక్ రావు ఠాక్రేను ఇంఛార్జ్ గా నియమిస్తూ ఇటీవలే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. 1954 లో మహారాష్ట్ర లో జన్మించిన మాణిక్ రావు ఠాక్రే 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్యెల్యే గా గెలిచారు. ఇక ౩ సార్లు ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.
2008 నుండి 2015 వరకు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, హోంశాఖ, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణంతో పాటు తెలంగాణ రాజకీయాలపై మంచి అవగాహనం ఉండడంతో అధిష్టానం ఆయన్ని ఎన్నికల సమయంలో ఇక్కడ ఇన్ ఛార్జ్ గా నియమించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం వారం రోజుల వ్యవధిలోనే మాణిక్కం ఠాగూర్ ని తొలగించి ఆయన స్థానంలో కొత్త ఇన్ ఛార్జ్ ను నియమించడం టి కాంగ్రెస్ లో కీలక పరిణామంగా చూడొచ్చు.