కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హేమంత బిస్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఈ నేతలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలను అవమాన పరిచేలా అసోం సీఎం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అందువల్ల బిస్వశర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అంత అసభ్యకరంగా మాట్లాడటమేంటని తీవ్రంగా మండిపడ్డారు.
సీఎం వ్యాఖ్యలపై కేంద్రానికి ఆ రాష్ట్ర డీజీపీ రిపోర్టు పంపిస్తారని అనుకున్నామని కానీ అలాంటిదేది జరగలేదన్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని బిశ్వాను సీఎం పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదని అందుకే తాము రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
హిమాంత్ బిశ్వను అరెస్టు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా మహిళలను కించపరిచేలా మాట్లాడిన బిస్వ శర్మను అరెస్టు చేసేందుకు స్పెషల్ టీమ్ లను పంపించాలన్నారు. తమ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసకుంటుందని అనుకుంటున్నామని, లేని పక్షంలో 48 గంటల తర్వాత రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లను, ఎస్పీ కార్యాలయాలను మట్టడిస్తామని హెచ్చరించారు.