భారత్ బ్యాడ్మింటన్ జట్టు 73 ఏళ్ల థామస్ కప్ గెలిచి చారిత్రక విజయం నమోదుచేసింది. ఈ సందర్భంగా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ పన్ను జట్టుపై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, తన బాయ్ ఫ్రెండ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది. అదేంటి.. థామస్ కప్ గెలిస్తే బాయ్ ఫ్రెండ్‌కి స్పెషల్ థాంక్స్ అనుకుంటున్నారా..?
జట్టు డబుల్స్ కోచ్ మాజీ దానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో. అతను బాలీవుడ్ యాక్టర్ తాప్సీ పన్ను బాయ్ ప్రెండ్ కూడా. ఈ సందర్భంగా శనివారం గేమ్ గెలిచిన అనంతరం.. తాప్సీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. టీంకు కంగ్రాట్స్ తెలియజేయడమే కాకుండా కోచ్‌కు స్పెషల్ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
‘మనోళ్లు సాధించారు. ఇండియాకు తొలి థామస్ కప్ తీసుకొచ్చారు’ అంటూ టీం మొత్తాన్ని ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది తాప్సీ. అంతేకాకుండా ‘మిస్టర్ కోచ్ మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు’ అంటూ మట్యాస్ బో ను ట్యాగ్ చేసింది.
థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాపై 3-0 తేడాతో గెలుపొందింది. భారత్ థామస్ కప్ టోర్నమెంట్‌లో తొలిసారి గెలుపొంది చరిత్ర సృష్టించింది.