‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ ఇది ఓ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. ఇప్పుడు దీని ప్రస్థావన ఎందుకు అంటురా.. ఆ డైలాగ్‌కు తగ్గట్లుగానే చాలా మంది ఓటర్లు సొంతూళ్లలో, నివాసముంటున్న పట్టణాలలో ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికలు వచ్చినప్పుడు ‘నేను తెలుగు ఓటర్‌ను.. ఆడా ఓటేస్తా.. ఈడా ఓటేస్తా’.. అంటూ రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇకపై రెండు చోట్ల ఓటు హక్కు చెల్లదు. ఈ మేరకు పీఎస్ఈ (ఫోటో సిమిలర్ ఎంట్రీస్) సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. దీని ద్వారా రెండేసి ఓట్లు ఉన్న వారి ముఖాలను గుర్తించి వాటిని తొలగించి.. ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండేలా చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ సాయంతో తెలంగాణలో డబుల్ ఓట్లు 2.15 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తాజాగా గుర్తించింది. ఈ జాబితాలను ఈసీఐ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌వోలకు చేరవేయనున్నారు. ఇక జాబితాలో ఒక చోట మాత్రమే పేరు ఉంచి, మిగతా వాటిని ఈ నెలాఖరు నాటికి తొలగించనున్నారు అధికారులు.
ఒకే పోలింగ్ స్టేషన్, ఒకే నియోజకవర్గం పరిధిలో ఉన్న బహుళ ఓట్లను గుర్తించి తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లోనూ.. తెలంగాణలోనూ ఓటు హక్కు ఉన్న వారి గుర్తింపునకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేస్తే, వాటిపై కూడా దృష్టి సారిస్తామని వెల్లడించారు.