ఐఫోన్ అన్నా, మంచి ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లు అన్నా యువతకు తీరని మోజు. యూత్ కోరుకునే ముఖ్యమైన వాటిలో ఈ రెండింటికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రెండూ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రమాదం వారికి కాదు ఐఫోన్ కు. ఈ విషయాన్ని స్వయంగా యాపిల్ సంస్థ ప్రకటించింది. భారీ శబ్దాలతో, అత్యంత వేగంగా దూసుకెళ్లే బైక్ ల నుంచి వచ్చే వైబ్రేషన్ ల కారణంగా ఐఫోన్ కెమెరా వ్యవస్థ దెబ్బతింటుందని యాపిల్ సంస్థ హెచ్చరించింది.
సాధారణంగా బైక్ లపై ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రూట్ కోసం జిపిఎస్ ఆన్ చేసి ఫోన్లను బైక్ పై పెడుతూ ఉంటారు. సాధారణ ఫోన్ ల పరిస్థితి ఏమో కానీ ఐఫోన్ లో మాత్రం ఇంజిన్ల నుంచి వచ్చే వైబ్రేషన్ ల కారణంగా ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టం దెబ్బతింటుందని యాపిల్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే చాలా మంది ఈ విధమైన కంప్లైంట్ తో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.
తమ సమస్యను డైరెక్ట్ గా యాపిల్ కు నివేదిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ ఆపిల్ బైక్ ల వల్ల ఐఫోన్ కు ప్రమాదం అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. అటు బైక్ ఖరీదైనదే, ఇటు ఐఫోన్ కూడా ఖరీదైనదే. కాబట్టి జాగ్రత్త వహించండి. ఒకవేళ మరీ అంత అవసరం అన్పిస్తే వైబ్రేషన్ ను తగ్గించే వస్తువులతో ఐఫోన్ ను బైక్ కు అమర్చుకోండి.