మునుగోడు.. ఉపఎన్నిక కారణంగా ఈ నియోజక వర్గం పేరు జాతీయంగాను ఎంతలా మార్మోగిందో అందరికి తెలిసిందే. ఇక కరెక్ట్ గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు మంత్రి కేటీఆర్ ఈ నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించి మరింత హీట్ పుట్టించారు. మొత్తానికి బీజేపీ ఖాతాలోకి పడుతుందనుకున్న మునుగోడును కారెక్కించుకోవడంతో గులాబీ దళం ఆనందానికి అవధులు లేకుండాపోయింది. అయితే రాజకీయంగా అంతా ఓకే.. కాని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రకటనతో బతుకుల్లో వెలుగు నిండుతాయనుకున్న పేదలకు మాత్రం నిరాశే మిగులుతుంది.
కటిక పేదరికంతో బతుకు ఈడ్చుతున్న వారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తునే కాటికి పయనమవుతున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మునుగోడు మండల కేంద్రంలో అండే కార్ శివాజీ అనే వ్యక్తి చనిపోయాడు. అతనిది నిలువ నీడ లేని పరిస్థితి. చేయడానికి పని లేదు. దీంతో అనారోగ్యంతో అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. మందులు కొనలేని, కడుపు నిండా తిండి కూడా తిన లేని దీనస్థితిలో చివరికి ప్రాణాలు వదిలాడు.
దీంతో ఇంటి యజమాని అతని మృతదేహాన్ని ఇంట్లో ఉంచడానికి కూడా నిరాకరించడంతో గ్రామస్తులు కొందరు కలిసి రోడ్డుపై టెంట్ వేసి అక్కడ శవాన్ని పెట్టారు. అయితే రెండేళ్ల క్రితం అతని భార్యది కూడా ఇదే పరిస్థితి. ఆమె కూడా అనారోగ్యంతో వైద్యం అందక, తిండికి అలమటించి ప్రాణాలు వదిలింది. ఇక ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లినా .. ఎలాంటి సహాయం అందలేదు. రూపాయి ఎవ్వరూ ఇవ్వలేదు. శివాజీ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు కూడా ప్రభుత్వ సాయానికి సర్పంచ్ ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో.. కనీసం ఓ సొంతిళ్లు కట్టించి.. చిన్న వ్యాపారం ఏదైనా పెట్టించి ఉంటే.. ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని సర్పంచ్ అంటున్నారు. ఇకనైనా మంత్రి కేటీఆర్ పట్టించుకొని పేదలకు ఇల్లు కట్టించి, వ్యాపారానికి సబ్సిడీ లోన్లు అందేలా చేయాలని ఆయన వేడుకుంటున్నారు.