సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో సందడులు తీసుకుని వస్తే ఆ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. అపార్ట్మెంట్లో వేసిన ముగ్గుల్ని ఫోటో తీయాలని ముచ్చట పడిన బాలిక కింద పడి ప్రాణాలు విడిచిన ఘటన కుషాయిగూడ పరిధిలో చోటు చేసుకుంది.
మృతురాలు 14 ఏళ్ల కిన్నెర. అప్పటిదాకా తమతో ఎంతో ఉత్సాహంగా గడిపిన బాలికను ఆస్పత్రిలో తీవ్రగాయాల మధ్య విగతజీవిగా చూసి ఆ కన్నవారు కంటికి మింటికి ఏకధాటిగా రోదించారు. కాప్రా సాధనా విహార్ కాలనీ ఆవాస్ అపార్టుమెంట్ బ్లాక్-బి, ఫ్లాట్ నెం 501(ఐదో అంతస్తు)లో నివాసం ఉండే కీర్తి, నాగర్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
కిన్నెర(14) ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. భోగి సందర్భంగా శనివారం ఉదయం అపార్టుమెంట్ ప్రధాన గేటు ఎదుట మహిళలు రంగు రంగుల ముగ్గులు వేశారు. సదరు ముగ్గులను చూసి మురిసిపోయిన కిన్నెర అపార్టుమెంట్ ఐదో అంతస్తునుంచి తన సెల్ఫోన్లో ఫొటోలు తీసేందుకు యత్నించింది.
ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. తీవ్రగాయలపాలైన కిన్నెరను వెంటనే సైనిక్‌పురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిన్నెర మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.