టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి విపక్షాలపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాడు బొంగరం లేని వాళ్లంతా పేపర్ లీక్‌పై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని తలసాని అంగీకరించారు. పేపర్ లీక్ విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మర్యాద తెలియదని.. ఎమ్మెల్యేలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా వుండటం వల్ల సికింద్రాబాద్‌కు రూపాయి పని జరగలేదని ఆయన దుయ్యబట్టారు. ఇక పార్టీలో అందరికీ పదవులు సాధ్యం కాదని.. ఓపిక పడితే అందరికీ న్యాయం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి తిరుపతికి మంది సంబంధాలున్నాయన్నారు. వీరిద్దరూ కూడా పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రాసిన వారిలో తిరుపతి, రాజశేఖర్ రెడ్డి మండలానికి చెందిన అభ్యర్ధులకు మంచి మార్కులు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ కార్యాలయం చక్కబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం కేసులో రేవంత్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో సిట్ అధికారులు సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ పీఏ తిరుపతి, ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి చెందిన మండలంలో గ్రూప్-1 పరీక్షల్లో వెయ్యి మంది ఉత్తీర్ణులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సిట్ అధికారులు కోరారు. పేపర్ లీక్ విషయమై విమర్శలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.