ప్రభుత్వంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ గవర్నర్ వివాదంపై స్పందించారు. గవర్నర్.. వారి పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. అసలు.. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుండో డిమాండ్ ఉందని గుర్తు చేశారు.
గవర్నర్ కు ఒక పరిధి ఉంటుందన్న తలసాని.. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యతారాహిత్యం అవుతుందని అన్నారు. మీడియాతో గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పారు. గతంలో ఉన్న గవర్నర్ ను గౌరవించామని.. తమిళిసై చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు తలసాని. ఒకనాడు ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తు చేశారు.
ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మాట్లాడుతూ.. బట్ట కాల్చి మీద వేసుడు కాదు… ధాన్యం మీరే కొంటే మైలేజ్ మీకే వస్తుంది కదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు తలసాని. ధాన్యం కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న శ్రీలంక లాంటి దేశాలకు పంపించొచ్చు కదా? అని సలహా ఇచ్చారు.
మరోవైపు డ్రగ్స్ విషయంపైనా స్పందించారు తలసాని. డ్రగ్స్ దందా వెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టమన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.