రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య సాగుతున్న ప్రోటోకాల్ పంచాయితీ ఇప్పుడప్పుడే తెగేలా లేదు. అసలు సమస్య ఏంటో చర్చిద్దామని తమిళిసై అంటుంటే.. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం రాజకీయాలు ఆపాలంటూ విమర్శలు చేస్తున్నారు. వివాదం మరింత ముదురుతుందే గానీ తగ్గే పరిస్థితులు అయితే కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు.
తాజాగా గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని.. తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు.
తమిళిసై రాజ్యాంగ పరిధికి లోబడి నడుచుకుంటే మంచిదని సూచించారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఏది పడితే అది గవర్నర్ మాట్లాడడం కరెక్ట్ కాదని.. ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ అని గుర్తు చేశారు.
మరోవైపు ప్రతిపక్షాలపైనా మండిపడ్డారు తలసాని. పని పాట లేకుండా పొద్దున లేస్తే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అని ప్రశ్నించారు.