అయ్యప్ప స్వామిపై బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే దీనిపై హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తాజాగా దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నరేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమన్నారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సహించరానిదన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా తెలంగాణ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నరేశ్ వ్యాఖ్యలపై అయ్యప్ప మాలధారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిన్న ఆందోళనకు దిగారు. కోస్గిలో బైరి నరేశ్ అనుచరుడు శంకర్ పై దాడి చేశారు. శంకర్ ను అయ్యప్ప భక్తులు పరుగెత్తించి కొట్టారు. నరేశ్ పై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.