పైకి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా.. తాలిబన్ల రాక్షసత్వం ఎలా ఉంటుందో చెప్పేందుకు తరచూ ఏదో ఓ వార్త బయటకొస్తూనే ఉంది. తాజాగా జర్నలిస్టులతో తాలిబన్లు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ మహిళలు రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పాక్, ఐఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రెచ్చిపోయిన తాలిబన్లు.. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
మహిళల ధర్నాను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన తాలిబన్లు కొందర్ని నిర్బంధించారు. వారిలో ఓ జర్నలిస్టును ముక్కు నేలకేసి రాయమని ఆదేశించారు. ప్రాణభయంతో అతను ఆ పని చేయక తప్పలేదు. మరో జర్నలిస్టును తన్ని కెమెరాను ధ్వంసం చేశారు. తాలిబన్లు నిర్బంధించిన వారిలో ప్రముఖ ఛానల్ టోలో న్యూస్ కమెరామెన్ కూడా ఉన్నాడు. దాదాపు మూడు గంటలపాటు వారి చెరలో ఉంచుకుని అందర్నీ విడిచిపెట్టారు తాలిబన్లు.