ఆ కారు 20 ఏళ్లుగా భూమిలో ఉంది. తాజాగా దాన్ని బయటకు తీశారు. ముందు భాగంలో కొంచెం దెబ్బతినడం తప్ప, ఇప్పటికీ మంచి కండిషన్ లో ఉంది. ఇంతకీ ఏంటి ఈ కారు గోల అనుకోకండి. దానికో పెద్ద స్టోరీ ఉంది.
9/11 దాడులు అమెరికాకు చీకటి రోజు. దీని తర్వాత అల్ ఖైదీ ఏరివేతను వేగవంతం చేసింది అమెరికా. ఆఫ్ఘాన్ ను చుట్టుముట్టి ఎక్కడివారిని అక్కడే చంపేసింది. ఈక్రమంలోనే బిన్ లాడెన్ ను మట్టుబెట్టింది. అయితే.. అల్ ఖైదా నేతలనే కాదు.. వారికి సహకరించిన తాలిబన్ అగ్రనేతలను సైతం వదలలేదు. ఆఫ్ఘాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా దళాల నుంచి తప్పించుకునేందుకు అప్పట్లో తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ అనేక ప్రయత్నాలు చేశారు.
అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాక.. ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే.. ఆయనకు ఓ వైట్ కలర్ టయోటా కారు ఉండేది. దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే అది ముందుతరాలకు దక్కాలన్న ఉద్దేశంతో అలాగే వదిలేయకుండా.. 2001లో జబూల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామంలో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ లో తాలిబన్ల రాజ్యం నడుస్తోంది. ఇన్నాళ్లకు ఒమర్ కారును తవ్వి బయటకు తీశారు.
ఈ పాత కారును కొత్తగా మార్చేసి.. రాజధాని కాబూల్ లోని ఓ మ్యూజియంలో పెడుతున్నారు తాలిబన్లు. ఇది ఎంతో గొప్ప కారని చెబుతున్నారు. కాందహార్ లో ఒమర్ నేతృత్వంలో ఏర్పడింది తాలిబన్ సంస్థ. 1996లో ఆఫ్గాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత దేశంలో కఠిన ఇస్లాం చట్టాన్ని అమలు చేసింది. దీంతో అనేక మిలిటెంట్ గ్రూపులకు స్థావరంగా మారింది ఆ దేశం. వారిలో 9/11 దాడుల వ్యుహకర్త ఒసామా బిన్ లాడెన్ కూడా ఉన్నాడు. ఒమర్ 2013లో ఓ స్థావరంలో దాగి ఉండగా.. అమెరికా దళాలు చంపేశాయని వార్తలు వచ్చాయి.. కానీ.. తాలిబన్లు దాన్ని ధృవీకరించలేదు.