ఆఫ్ఘనిస్థాన్‌లో సుస్థిరమైన, సుపరిపాలన అందించాల్సిన బాధ్యత తాలిబన్‌లపై ఉందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ అన్నారు. అంతర్జాతీయ సమాజానికి వారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. అలాగే దేశీయ ఉగ్రవాద గ్రూపులను ఏరివేయాల్సి ఉందని తెలిపారు. భారత్ సందర్శనకు వచ్చిన ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తాలిబన్ల ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు అవసరమైన భద్రతతో పాటు ఆర్థికంగా, సామాజికంగా వారు స్థిరపడేలా ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అది జరగాలంటే అందరినీ కలుపుకొని పోవడమే ఏకైకమార్గమని స్పష్టం చేశారు. పాలనలో అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు ఇవ్వడం ద్వారానే అది జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత సౌదీ వారి పాలనపై వ్యక్తీకరించిన స్పష్టమైన అభిప్రాయం ఇదే.
1990ల నాటి పాలనలో సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలు నెరిపిన తాలిబన్లు.. ప్రస్తుతం ఆదేశాన్ని దూరం పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభోత్సవానికి టర్కీ, ఖతార్, ఇరాన్, పాకిస్థాన్, రష్యా ,చైనాలను ఆహ్వానించినప్పటికీ, గతంలో మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈలను వదిలేశారు.