రోజులు గడిచేకొద్ది.. తాలిబన్ల నిజ స్వరూపం బయటపడుతోంది. ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిగా చేజిక్కించుకునేవరకు శాంతి వచనాలు వల్లెవేసిన వారు.. ఇప్పుడు తమలోని రాక్షసులని నిద్రలేపుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో గతంలో విధించిన కఠినమైన శిక్షలు తిరిగి అమలు చేస్తామని తాలిబాన్ ముఖ్య నాయకుడు ముల్లా నూరుద్దీన్ తురాబి తాజాగా బాంబ్ పేల్చారు. తాము కచ్చితంగా ఇస్లాంనే అనుసరిస్తామని, ఖురాన్ ప్రకారమే చట్టాలను రూపొందిస్తామని చెప్పారు.
నూరుద్దీన్ తురాబి తాలిబాన్ వ్యవస్థాపకులలో ఒకరు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు పాలించినప్పుడు.. ఇస్లామిక్ చట్టాలు కఠినంగా అమలయ్యేలా ఆయనే పర్యవేక్షించేవారు. తప్పు చేసినవారికి గతంలోలానే ఉరిశిక్షలు, అలాగే కాళ్లు, చేతుల విచ్ఛేదనం ఉంటుందని వెల్లడించాఉ. అయితే ఈ శిక్షలను బహిరంగంగా విధించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ముల్లా నూరుద్దీన్ తురాబి ఈ వ్యాఖ్యలు చేశారు.
తాలిబాన్ల విధించే శిక్షలపై ప్రపంచ దేశాల ఆగ్రహాన్ని తోసిపుచ్చారు నూరుద్దీన్. తమ పాలన విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇతర దేశాలను హెచ్చరించారు. ఆయా దేశాల్లోని చట్టాలు, శిక్షల గురించి తాము ఎన్నడూ ఏమీ మాట్లాడలేదని, అలాగే ఇతరదేశాల నుంచి తామూ అదే కోరుకుంటున్నట్టు వివరించారు.
కొత్త తాలిబాన్ ప్రభుత్వంలో, నూరుద్దీన్ తురాబి జైళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి నిషేధం విధించిన ఉగ్ర తాలిబన్లలో ఆయన కూడా ఒకరు. కానీ తాత్కాలిక మంత్రివర్గంలో ఆయనా ఉన్నారు. తురాబీ వికలాంగుడు. 1980 లలో సోవియట్ దళాలతో పోరాడుతున్నప్పుడు తురాబీ ఒక కాలు, ఒక కన్ను కోల్పోయాడు.