ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనతో అరాచకాలు మళ్లీ మొదలైపోయాయి. ఒక్కో అంశంపై ఒక్కో రోజు కొత్త ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఇస్లాం మత సంప్రదాయాలకు అనుగుణంగా తమ పాలన ఉంటుంందని ప్రకటించిన తాలిబన్లు… తాజాగా సెలూన్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
హెల్మాండ్ ప్రావిన్స్ కు వార్నింగ్ ఇస్తూ స్థానికులకు గడ్డం ట్రిమ్ చేయవద్దని సూచించారు. కాదని ట్రిమ్ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. గడ్డం కత్తిరించటం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమన్న తాలిబన్లు, కాబూల్ లోనూ ఇవే ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు జారీ కావటంతో సెలూన్లపై ఇక నుండి నిఘా ఉండనుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అక్కడికక్కడే శిక్షలు అమలు చేయబోతున్నారు.
అమెరికా స్టైల్స్ ఇక చాలని, గత 20 ఏళ్లుగా ఇష్టం వచ్చినట్లుగా హెయిర్ కట్, గడ్డం చేసుకున్న యువత అంతా ఇక తాలిబన్ల ప్రభుత్వం మాట వినాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి కొత్తగా ప్రజాస్వామికంగా పాలన ఉంటుందని చెప్పిన తాలిబన్లు ఆచరణలో మాత్రం తమ పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు.