తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం నిధుల కటకటతో సతమతమవుతోంది. ఆప్ఘనిస్థాన్ చేసే సాయాన్ని అన్ని దేశాలు నిలిపివేయడంతో ప్రభుత్వానికి నడిపించడం వారికి కష్టంగా మారుతోంది. దీంతో వారు పురాతన నిధులను తాకట్టు పెట్టి సొమ్ములు చేసుకునే ఆలోచన చేస్తున్నారు. ఈక్రమంలో వారి దృష్టి బ్యాక్ట్రియన్ గోల్డ్ నిధిపై పడింది. అత్యంత విలువైన బంగారు వస్తువుల సమాహారమైన బ్యాక్ట్రియన్ గోల్డ్ ఎక్కడ ఉందనే దానిపై అన్వేషణ మొదలుపెట్టామని తాలిబన్ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ టోలో న్యూస్‌కు చెప్పారు.40 ఏళ్ల క్రితం ఉత్తర అఫ్గాన్‌లో ప్రాంతంలోని జ్వాజియన్ ప్రావిన్స్‌కు చెందిన షేర్‌బర్ఘన్ జిల్లాలో ఈ నిధి బయటపడింది. 20 వేలకు పైగా పురాతన వస్తువులు నాటి తవ్వకాల్లో లభ్యమయ్యాయి. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, గుర్రం, ఎనుగు బొమ్మలు సహా ఇండియాలో తయారైన కళాఖండాలు కూడా ఇందులో ఉన్నట్టు చెబుతారు.ఈ నిధి మొత్తం క్రీస్తుపూర్వం 1వ శతాబ్ధకాలానికి చెందినదని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ నిధి ప్రదర్శనతో ఆప్ఘనిస్థాన్‌కు ఇన్నాళ్లుగా ఆదాయం కూడా సమకూరింది. 2006 నుంచి 2020 వరకు.. వివిధ దేశాల్లో దీన్ని ప్రదర్శించి 4.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది కూడా.
అలాంటి నిధి ఇప్పుడు ఎక్కడ ఉందనేది తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం కనుక్కోలేకపోతోంది. అయితే ఆ నిధి ఆప్ఘాన్‌లో ఉంటే సరేనని, ఇతర దేశాలకు తరలించి ఉంటే మాత్రం దాన్ని రాజద్రోహంగా పరిగణిస్తామని ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఆప్ఘాన్ పౌరులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిధి వారి కంటపడకూడదని కోరుకుంటున్నారు. వారి చేతికి చిక్కితే.. ఎవరికో అమ్మేస్తారని ఆందోళన చెందుతున్నారు.