పాకిస్తాన్ కు తాలిబాన్లు షాక్ ఇచ్చారు. భద్రతా మండలిలో పాక్ పై తాలిబాన్లు ఫిర్యాదు చేశారు. తమ దేశంలోని కోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని భద్రతా మండలికి తాలిబాన్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
తాలిబాన్ ప్రభుత్వం తరఫున నాసిర్ అహ్మద్ ఫెయిక్ ఈ ఫిర్యాదును చేశారు. ఫెయిక్ ఫిర్యాదుకు తాలిబాన్, హక్కానీ నెట్ వర్క్, తెహరీక్ ఈ తాలిబాన్ లు మద్దతు తెలిపాయి. పాక్ మిలిటరీ జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో తమ ప్రజలు 40 మంది చనిపోయారి ఫెయిక్ తెలిపారు.
పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్ అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖలో ఫెయిక్ తెలిపారు. ఈ దాడిలో వందల ఇండ్లు ధ్వంసమయ్యాయని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఈ చర్య ద్వారా మానవ హక్కులకు పాక్ భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. ఇది యూఎన్ చార్టర్ తో పాటు ఐరాస సాధారణ అసెంబ్లీతో పాటు భద్రతా మండలి తీసుకున్న నిర్ణయాలను ఉల్లంఘించడమేనని అన్నారు.
ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఫెయిక్ తెలిపారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందన్నారు.