ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. రాజధాని కాబూల్ ను నలువైపుల నుంచి చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ ఈ విషయం తెలిసి నిర్ఘాంతపోయినట్లు చెప్పారు.
మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల న్యాయవాదుల భద్రతపైనే తన ఆందోళన అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాలు, ప్రాంతీయ, స్థానిక శక్తులు.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వాలన్నారు. శరణార్థులు, పౌరులను కాపాడాలని అభ్యర్థించారు.
మలాలా ప్రస్తుతం యూకేలో ఉన్నారు. పాకిస్తాన్ లో బాలికల విద్యా హక్కు కోసం పోరాటం చేస్తున్న క్రమంలో తాలిబన్ ప్రతినిధి ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమె… మహిళల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్నారు.