ఆప్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల ఆరాచకాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. పైకి శాంతి వచనాలతో ప్రపంచ దేశాలను పక్కదారి పట్టిస్తూనే.. తాము చేయాల్సిన పనులను మాత్రం చేసుకుంటూ పోతున్నారు వారు. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ మొత్తం వారి గుప్పిట్లోకి వెళ్లడంతో వివిధ దేశాలు.. తమ రాయబార కార్యాలయాలు, ఇతర ఆఫీసులను మూసివేయగా తాలిబాన్లు ఇప్పుడు వాటిల్లోకి చొరబడుతున్నారు. ఈ క్రమంలో భారత దౌత్య కార్యాలయాల్లోకి కూడా చొరబడి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు.
కాందహార్, హెరాత్ నగరాల్లో భారత దౌత్య కార్యాలయాలు తాళాలు వేసి ఉన్నప్పటికీ.. వాటిని పగులగొట్టి అందులోకి ప్రవేశించారు. చాలాసేపు అక్కడి గదుల్లో వేటి గురించో వెతికారు. ఆ తర్వాత బయట పార్క్‌చేసి వాహనాలను ఎత్తుకెళ్లారు. అయితే ఆప్ఘనిస్థాన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉండటంతో.. కీలక పత్రాలు ఏవైనా దొరుకుతాయేమోనన్న ఆలోచనతో వారు సోదాలు చేసి ఉంటారని భావిస్తున్నారు. జలాలాబాద్, కాబుల్‌లోని కాన్సులేట్, ఎంబసీల్లో తనిఖీల గురించి స్పష్టత లేదు.