ప్రాణభయంతో పరుగు.. తాలిబన్ల చెర నుంచి విముక్తి కోసం ఆరాటం.. అయినా వారిని మృత్యువు వెంటాడింది. వేటాడింది. కాబూల్ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం ఆఫ్ఘాన్ పౌరులు భారీగా వచ్చారు. దేశాన్ని వదిలిపోవాలని పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది.
తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకు ఆశ్రయమిస్తామని అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్రజలు వేలాది మంది కాబూల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారు.
మరోవైపు ఆఫ్ఘాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో తాజాగా 168 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ లో ఈ విమానం దిగింది.