ఆప్ఘనిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు.. అతి త్వరలోనే అధికారింగా పాలన సాగించబోతున్నారు. ఈక్రమంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో తమ జెండాను ఎగరేస్తున్నారు. పాత జెండాలను తొలగించి.. కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆప్ఘాన్ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా.. తమ పని తాము చేసుకుంటూపోతున్నారు. ఇంతకి తాలిబన్లు ఎగరేస్తున్న జెండాల్లో ఏముంది? దాని అర్థమేంటి?
తాలిబన్లు గతంలో తాము అధికారంలో ఉన్న 1996- 2001 మధ్య కాలంలో ఉపయోగించిన చిహ్నానే ఇప్పుడూ వినియోగిస్తున్నారు. తెల్లని రంగు వస్త్రంపై మధ్యలో నల్లటి రంగులో కొన్ని అక్షరాలు కనిపిస్తుంటాయి. అల్లా తప్ప మరో దేవుడు లేడు.. మహ్మద్ అల్లా పంపిన సందేశం అని అందులో రాసి ఉంది. ఈ వచనాన్ని శహదా అంటారు. ఖురాన్ బోధించే ఐదు ప్రధాన అంశాల్లో ఇది ఒకటి అని చెబుతుంటారు. అలాగే ఆ జెండాపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్ అని కూడా రాసి ఉంది. ఆప్ఘనిస్థాన్‌కు ఇటీవలే తాలిబన్లు ఈ పేరును పెట్టారు.
1996లో ఈ మిలిలెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ అధికారంలోకి వచ్చినప్పుడు తొలుత.. కేవలం తెల్లని రంగుతో కూడిన జెండా మాత్రమే ఉండేది. మరుసటి ఏడాది ఈ శహదాను జోడించారు. 1901లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత… ఆప్ఘనిస్థాన్ జాతీయ జెండా 18సార్లు మారింది.