ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ పాత రోజులు కనపడేలా ఉన్నాయి. బహిరంగంగా ఉరితీయటం, కాళ్లు-చేతులు నరకడాలు మళ్లీ సాధారణంగా కనపడనున్నాయి. ఆప్ఘన్ ను కైవసం చేసుకున్నతాలిబన్లు… ఒక్కొక్కటిగా తమ పాత పద్ధతులను పునరుద్దరిస్తున్నారు.
ఇప్పటికే మహిళలకు చదవులు, ఉద్యోగాలను తొలగించారు. ఇప్పుడు బహిరంగంగా ఉరితీత, కాళ్లు-చేతులు నరకం వంటి చర్యలపై ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు.
తాము ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించారు. మా చట్టాలు మావి. ఇతర దేశాల చట్టాలను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. కానీ మా చట్టాలను వారు గౌరవించకపోతే ఎలా అంటూ తాలిబన్లు ప్రశ్నిస్తున్నారు. ఖురాన్ ఆధారంగా మా చట్టాలుంటాయి, న్యాయమూర్తులు కేసులపై విచారించి తీర్పునిస్తారు. వాటి ఆధారంగానే శిక్షలు అమలవుతాయని తెలిపారు. తమ చట్టాలు బహిరంగంగా అమలు చేయటం వల్ల తప్పులు చేసే వారు భయపడి వెనక్కి తగ్గుతారన్నారు.
తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో ఆప్ఘన్ ను పాలించినప్పుడు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలను బహిరంగంగా అమలు చేసేవారు. వందలాది మంది చూస్తుండగా శిక్షలు అమలయ్యేవి. బాధితుల కుటుంబ సభ్యులు దోషి తలలోకి కాల్చి చంపేలా ఆదేశాలిచ్చే వారు. దొంగల చేతులు నరికేవారు. దోపిడీ చేస్తే కాళ్లు నరికేవారు.