తాలిబన్ల రాక్షస రాజ్యంలో కఠిన శిక్షలు ప్రారంభమయ్యాయి. దొంగతనానికి పాల్పడ్డారన్న ఆరోపణపై 9 మందికి కొరడా దెబ్బల శిక్ష విధించారు. అంతటితో ఆగక నలుగురి చేతులు నరికి వేశారు. కాందహార్ లోని ఓ ఫుట్ బాల్ స్టేడియంలో అనేకమంది చూస్తుండగా ఈ శిక్షలను అమలు చేశారు. నిందితులపై 35 నుంచి 39 సార్లు కొరడా ఝళిపించారని గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి హాజీ జైద్ తెలిపారు.
తాలిబన్ అధికారులు, మతగురువులు, వృద్దులు, స్థానికులు చూస్తుండగా ఈ ‘రాక్షస కాండ’ కొనసాగింది. తమ శిక్షల కోసం ఎదురు చూస్తూ 9 మంది నిందితులు గడ్డితో కూడిన మైదానంలో కూర్చున్న ఫోటోలను మానవ హక్కుల కార్యకర్త, శరణార్ధుల పునరావాస శాఖ మాజీ మంత్రి షబ్నమ్ నసీమి షేర్ చేశారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. కనీసం వారిని విచారించలేదన్నారు.
ఈ స్టేడియం బయట ఉన్న తాజుద్దీన్ సోరోష్ అనే జర్నలిస్టు కూడా వీటిని సర్క్యులేట్ చేస్తూ.. ఆఫ్ఘానిస్తాన్ లో చరిత్ర మళ్ళీ మొదలైందని, 1990 ప్రాంతాల్లో మాదిరి తాలిబన్లు బహిరంగ శిక్షలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత డిసెంబరులో హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తిని హతమార్చారని ఆయన గుర్తు చేశారు. హతుడైన వ్యక్తి తండ్రికి అసాల్ట్ రైఫిల్ ఇచ్చి కాల్పులు జరిపించారని, వందలాది మంది చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆ జర్నలిస్టు వెల్లడించారు.
ఇక కాబూల్ వంటి నగరాల్లో బట్టల షాపుల్లో బయట ఉన్న మోడల్ బొమ్మల ముఖాలు కనిపించకుండా వాటికి నల్లరంగు పూస్తున్నారు. ఇప్పటికే దేశంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో మహిళల చదువుపై తాలిబన్లు అనేక ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ దేశాలు తాలిబన్ల అరాచక చట్టాలను ఖండిస్తున్నప్పటికీ, దాన్ని పట్టించుకోకుండా వీరు బహిరంగ శిక్షలను అమలు పరుస్తున్నారు. క్రూర శిక్షలను నిలిపివేయాలని ఐరాస నిపుణులు సూచిస్తున్నా ప్రయోజనం లేకపోతోంది.