ఎన్నో ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. ఈ పాలన మాకొద్దు మహాప్రభో అంటూ జనం చుట్టుపక్కల దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి. అయితే.. సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతున్న వీడియోల్లో మగవాళ్లే కనిపిస్తున్నారు. ఆడవాళ్లు చాలా తక్కువ మంది వలస బాట పట్టారు. ఎక్కువశాతం మంది ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు వారి భవితవ్యంపైనే ఆందోళన నెలకొంది.
ఇప్పటికే 15 ఏళ్లు పైబడిన బాలికలు, 45 ఏళ్లు లోపు వితంతువుల లిస్టును ప్రిపేర్ చేస్తున్నారు తాలిబన్లు. ఉగ్రవాదులతో వివాహం జరిపించడానికే ఈ జాబితా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళల హక్కులపై తాము మారిపోయామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ వారిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్లు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలే అందుకు నిదర్శనం. వేలాది మంది మహిళలను లైంగిక బానిసత్వానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
1996-2001 మధ్య తాలిబన్ల పాలనలో మహిళలు అత్యంత కఠినమైన జీవనాన్ని గడిపారు. నిరంతరం మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారు. ఉద్యోగం చేయడానికి లేదు. చదువుకొనే అవకాశం లేదు. బురఖా ముసుగు వెనకే వారి జీవనం సాగింది. ఇంటి నుండి బయటకు వెళ్లడం నిషేధం. మగవారి సంరక్షణలోనే జీవించాలి. ఇలా ఎంతో కఠినమైన జీవనాన్ని గడిపారు. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు ఆఫ్ఘాన్ ను ఆక్రమించుకోవడంతో మళ్లీ ఆనాటి ఆంక్షలు వస్తాయని భయపడుతున్నారు మహిళలు.
గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘాన్ మహిళలు ఎంతో సాధించారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ రాణించారు. కానీ,, తాలిబన్ల రాజ్యంలో అది కుదరని పని. 2018లో ఆఫ్ఘనిస్థాన్ తొలి మహిళా మేయర్ గా ఎన్నికైన జరీఫా గఫారీ సైతం అదే భయంతో ఉన్నారు. తాలిబన్లు తన లాంటివారిని వెతికి చంపేస్తారు.. కానీ.. ఎక్కడికీ వెళ్లను.. ఇంట్లోనే ఉంటానంటూ ఆమె ప్రకటించారు. ప్రస్తుతం మహిళలు ఎవరూ బయటకు వెళ్లడం లేదు. కానీ.. తాలిబాన్లు మాత్రం వారు ఎంతమంది ఉన్నారో లిస్టు ప్రిపేర్ చేస్తున్నారు.