అఫ్ఘనిస్థాన్ క్రమంగా తాలిబాన్ల హస్తగతమవుతోంది. ఒక్కో ప్రాంతంపై మెల్లమెల్లగా పట్టు సాధిస్తున్నారు. నాటో, అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్తుండటం తాలిబాన్లకు మరింత కలిసొస్తోంది. దీంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. వరుసగా దేశంలోని ప్రధాన ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు.
తాజాగా ఆదేశంలోని రెండవ అతిపెద్ద నగరం కాందహార్, హెరత్‌లతో పాటు మరో కీలక ప్రాంతమైన లష్కర్ షా తమ చేతికి చిక్కినట్టు తాలిబాన్ తమ అధికారి ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.తాలిబాన్లతో యుద్ధం చేయలేక ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు చేతులెత్తేయాల్సి వస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని మొత్తం 34 ప్రావిన్సుల్లో ఇప్పటికే 12 ప్రావిన్సులను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. మరో 10 చోట్ల దాడి కొనసాగిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్థాన్‌లో 65 శాతం భూభాగాన్ని ఇప్పటికే తాలిబాన్లు తమ వశం చేసుకున్నారు.
వాస్తవానికి వారం రోజుల క్రితం, అఫ్ఘాన్-ఇరాన్ సరిహద్దుల్లోని నిమ్రూజ్ రాజధాని జరాంజ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడే.. ఆఫ్ఘాన్ ప్రభుత్వం పతనం మొదలైందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. 1.60 లక్షల జనాభా కలిగిన జరాంజ్‌ను స్వాధీనం చేసుకోవడం వారి తొలి విజయంగా అభివర్ణించారు. ఈ వేగంతోనే ఇలానే ముందుకు వెళ్తే నెలల వ్యవధిలోనే తాలిబాన్లు దేశం మొత్తాన్ని అక్రమించుకోగలరని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ ప్రభుత్వ సేనలపై పట్టు సాధించే క్రమంలో..వందలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే వేయికి మందికిపైనే చనిపోయి ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇక అక్కడ వైద్య సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్.. నిత్యం వేలాది మందికి చికిత్స చేస్తున్నట్టు చెబుతోంది. దేశవ్యాప్తంగా అఫ్ఘాన్ సేనలు రెచ్చిపోతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాబుల్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ నిపుణులు అంచనా ప్రకారం.. నెల రోజల్లో కాబుల్‌లో కూడా తాలిబాన్లు జెంగా ఎగరేయడం ఖాయమని అంటున్నారు.
ఇదిలా ఉంటే చేతులు కాలక ఆకులు పట్టుకుంటోంది ఆఫ్ఘాన్ ప్రభుత్వం. దేశంలో అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఖతర్‌లోని తాలిబాన్ ప్రభుత్వానికి సందేశం పంపింది. కానీ ఈ ప్రతిపాదన ఇప్పటికే ఆలస్యమైపోయిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. దేశం మొత్తం తమ గుప్పట్లోకి తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్న తాలిబాన్లు.. ఇక ప్రభుత్వం మాట వినే పరిస్థితిలో లేరని అంటున్నారు.
మరోవైపు తాలిబాన్ ప్రభుత్వాన్ని అంగీకరిస్తున్నట్టు తాజాగా చైనా కూడా ప్రకటించింది. ఇప్పటికే పాకిస్థాన్ తాలిబాన్లకు మద్దతు తెలిపింది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఏ ప్రభుత్వం మనుగడలో ఉన్నా సత్సంబంధాలు కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘాన్ అధికారులతో పాటు.. ఖతర్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది.