ఎన్నడూ లేని విధంగా తాలిబన్లకు ఇండియా 4 రోజుల క్రాష్ కోర్స్ ను చేబట్టింది. ‘భారతీయ ఆలోచనల్లో మమేకం కావడం ఎలా’ అన్న అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ..కోజికోడ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా మొదటిసారిగా ఈ కోర్స్ ను నిర్వహిస్తోంది. ఆన్ లైన్ ద్వారా మంగళవారం నుంచి ఈ కోర్స్ కు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు హాజరు కావడం విశేషం. విదేశాంగ మంత్రిత్వ శాఖ లోని ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ ఈ వెరైటీ, విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించింది.
వివిధ దేశాల్లోని ప్రాజెక్టులను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది. 2021 లో ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటికీ.. దాన్ని ఇండియా ఇంకా గుర్తించలేదు. అయినా ఆ దేశ రాజధాని కాబూల్ లో మళ్ళీ తన ఎంబసీని తెరచింది. ఈ క్రాష్ కోర్స్ ఈ నెల 17 వరకు ఉంటుందని, అన్ని దేశాల నుంచి పాల్గొనేవారికీ ఇది ఓపెన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ మాదిరే మలేసియా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి కూడా డెలిగేట్లు ఇందులో పాల్గొనవచ్చునని వివరించాయి.
భారత ఆర్థికాభివృద్ధి, భారత సాంస్కృతిక వికాసం, సోషల్ బ్యాక్ డ్రాప్ వంటి వివిధ అంశాలపై ఈ క్రాష్ కోర్స్ ఉంటుంది. తాలిబాన్లకు కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపిందంటే ఆ దేశ ప్రభుత్వాన్ని గుర్తించకుండానే ఆ గ్రూప్ తో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడానికి చేపట్టిన చర్యగా దీన్ని భావిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు, బిజినెస్ లీడర్లు, ఎగ్జిక్యూటివ్ లు, ఔత్సాహిక పారిశ్రామివేత్తలు తదితరులతో కూడిన సుమారు 30 మంది ఈ కోర్సుకు హాజరై ఈ నాలుగు రోజులూ భారతీయ విశిష్టత గురించి వివరించనున్నారు. తాలిబన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని ఆఫ్గనిస్తాన్ ..’దరి’ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ ఓ సర్క్యులర్ లో తెలిపింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూడబోతే ఇండియా తన వైఖరి మార్చుకుని తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలనుకుంటోందా అన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.