అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఆప్ఘాన్‌పై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. దేశం విడిచి వెళ్లాలనుకునేవారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదో ఒక కారణం చూపించి తమ ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా వీసాలు చేతిలో ఉన్నా..వందలాది ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుల వద్దే నిరీక్షిస్తున్నారు. ఇందులో ఆప్ఘాన్, అమెరికాతో పాటు వివిధ దేశాల పౌరులు ఉన్నారు.
మొన్నటివరకు కాబూల్ విమానాశ్రయానికే ప్రయాణీకులు పోటెత్తగా..ఇప్పుడు మజార్-ఇ-షరీఫ్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. విమానాల్లో వెళ్లేందుకు వందలాది మంది తాలిబన్ల అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. వారిని తీసుకొచ్చేందుకు అమెరికా ఆరు విమానాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. కానీ తాలిబన్లు వారికి అనుమతి ఇవ్వడం లేదు. తమ డిమాండ్లను తీర్చుకునేందుకే తాలిబన్లు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.