ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మహిళలపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీస్తోంది. ‘కరుత్తు గలై పుదివుసెయ్’ సినిమా ఆడియో విడుదల పంక్షన్లో భాగ్యరాజ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మహిళలు బాగానే ఉండేవారని, ఫోన్లు వచ్చిన తర్వాత అదుపుతప్పుతున్నారన్నారని చెప్పారు. ఈ విషయం చెప్పడం తనకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని సంఘటనల్లోనూ అబ్బాయిలదే తప్పనడం సరికాదని..మహిళలు చనువిస్తేనే పురుషులు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అన్నారు. నిజానికి పురుషులు తప్పు చేస్తే అది చిన్న విషయంగా ముగిసిపోతుందని…స్త్రీలు తప్పు చేస్తే అది పెను సమస్యకు దారితీస్తుందని చెప్పారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కూడా చంపేసిన మహిళల గురించి వార్తల్లో చూస్తున్నామని…కానీ పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎలాంటి సమస్య తలెత్తకుండా భార్యలను చూసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
భాగ్యరాజ్ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో స్పందించారు. అత్యాచారాలకు మహిళలే కారణమని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమని..ఇలాంటి వ్యాఖ్యలతోనే అమ్మాయిలు చనిపోతున్నారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.